100% FREE Shipping all across India

తెలుగు ప్రజల మొదటి పండుగ ఉగాది

తెలుగు ప్రజల మొదటి పండుగ ఉగాది

భమిడిపాటి బాలాతిపురసుందరి

గడిచి పోతున్న జీవితంలో ఉత్సహన్ని ఉల్లాసాన్ని నింపుకుంటూ కుటుంబ సంబంధాలు, స్నేహం, మానవత్వం వంటివాటిని నిలుపుకుంటూ అనందంగా జరుపుకునేవి పండుగలు. ప్రాంతాన్ని, భాషని బట్టే అచార వ్యవహారాలు, సంస్కృతి నడుస్తూ ఉంటాయి. ప్రాంతము, భాష, సంస్కృతి ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటాయి. ఏ పండుగ జరుపుకున్నా ఆ యా ఋతువుల్ని అనుసరించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకునే పిండివంటలు కూడా నిర్ణయింప బడ్డాయి. ఏ పండుగకి ఏ పిండివంటలు చెయ్యాలో,  ఏ పదార్ధం ఏ దేవుడికి నైవేద్యంగా పెట్టాలో కూడా పూర్వ కాలం నుంచి వస్తున్నసంస్కృతిలో భాగమే. ప్రతి పండుగరోజు ఆ పండుగ జరుపుకోడానికి కారణం, అందువల్ల ప్రయోజనము తెలియ చేసే విధంగా పాటలు, ఆటలు హరికథలు, బుర్ర కథలు వంటివి తెలుగుజాతి సంస్కృతిని నిలబెట్టడంలో ముఖ్య పాత్రని పోషిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతిని గొప్ప సంపదగా భద్రపరిచి ఎక్కడా ఆగిపోకుండా తరతరాలకి అందిస్తున్నది మనము జరుపుకుంటున్న పండుగలే!

తెలుగు సంవత్సరాల్ని అనుసరించి జరుపుకునే మొదటి తెలుగు పండుగ ‘ఉగాది’

      ఉగాది పచ్చడి తినడం వల్ల జీవితంలో కలిగే కష్ట సుఖాల్ని సమ దృష్టితో చూడగలగడం... పాడి పంటలే సిరిసంపదలు కనుక పశువుల్ని ఆదరించడం...వసంత మాసం పేరుతో వసంత మాధవ పూజలు, వసంతోత్సవాలు, వసంత నవరాత్రులు జరపడం, బాటసారుల కోసం చలివేంద్రాలు పెట్టడం, చెప్పులు గొడుగులు దానం ఇయ్యడం వంటివే కాకుండా జాతర పేరుతో బంధుమిత్రులు అందరూ కలిసి మెలిసి ఉండాలని తెలియ చెప్తోంది.

   పండుగల పేరుతో లేనివాళ్ళకి ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలన్నది పుణ్యంగా భావించి జరుపుతున్న ఆచారం. కొత్త తెలుగు సంవవత్సరం మొదటి నెల మొదటి రోజు జరుపుకునే పండుగ యుగాది లేక ఉగాది. ఇది పూర్తిగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పండుగ.

   రాబోతున్న కొత్త తెలుగు సంవత్సరం పేరు ’’శుభకృత్’’. మొదటి మాసం చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగని జరుపుకోబోతున్నాం. మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కట్టుకుని ఉదయాన్నే ఉగాది పచ్చడిని తిని, కొత్త పంచాగానికి పూజ చేస్తారు. సాయంత్రం పంచాంగ శ్రవణం చెయ్యడం ఆచారంగా వస్తోంది.

నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభ: ప్రతిగృహ ధ్వజారోహణం|

నింబపుష్పాశనం సంవత్సర పంచాంగం శ్రవణం నవరాత్రారంభ: ||

   ఈ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు. ఆరు రుచులు అంటే అన్ని రుచులు కలిగిన ఉగాది పచ్చడి తినడమంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్ని ఒకేలా స్వీకరించడం అని అర్ధం. ఈ పచ్చడికి వాడే ప్రతి వస్తువు వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది.  అన్ని రుచులూ కలిగిన ఆహారం తీసుకుంటే... “శతాయర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ”. నిండు నూరేళ్ళు  వజ్రంతో సమానమైన దేహం కలిగి జీవిస్తారు అని అర్ధం.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ‘నింబ కుసుమ భక్షణం‘, ‘అశోకకళికా ప్రాశనంఅని పేర్లతో వ్యవహరించేవారు. రుతువులలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుండి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఉగాది పచ్చడిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగిస్తారు. బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దు:ఖానికి, నష్టానికీ, ద్వేాషానికీ, అపజయానికి సంకేతం. ఈ రెండు కలిపి తీసుకుంటే కష్టసుఖాలు, ప్రేమానురాగాలు, విజయం చేకూరాలని చెప్పడమే.

‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు‘ అనే మంత్రాన్ని చదువుతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి హిందూ పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తోంది.
   ఉగాది రోజు పశువుల్ని పూజించడం ఆచారం. గ్రామీణులకి పాడిపంటలే సిరిసంపదలు. అవి అందుకోడానికి సహయపడుతున్నవి పశువులు. అందుకే పశువుల్ని పూజించడం సంస్కృతిలో ఒక భాగంగా మారింది.

   కొత్త పంటలు చేతికి రాగానే ముందుగా నైవేద్యం పెడతారు. తరువాత తిరగలికి, రోలుకి, చల్లగుంజకి, కూరాడుకి కూడా పెట్టి ఆ నైవేద్యాన్ని ఆడపడుచులు, కోడళ్ళు కలిసి తింటారు.

  సాయంకాల సమయంలో కొత్త సంవత్సరంలో జరగబోయే మంచి చెడ్డల్ని; ఆదాయ-వ్యయాలు; వానా-వరదలు; ధరలు, లాభ నష్టాలు; మొదలైన సంవత్సరంలో కలిగే  ఫలితాల్ని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. దీన్ని ఒక పుణ్య కార్యంగా భావిస్తారు.

   ఇంక పండుగ వస్తే యాచకుల సందడి మామూలే!  పెట్టిన వాళ్ళని పొగడడం, పెట్టని వాళ్ళని తిట్టడం. “’పెడితే పెళ్ళి- పెట్టకపోటే శ్రాద్ధం’అనే సామెత దీన్నుంచే వచ్చిందేమో!

   ఉగాది మొదలు పెట్టి పది రోజులు బంధువులు, స్నేహితులు కలిసి ఊరి బయట ఉన్న ప్రదేశానికి వెడతారు. వెళ్ళేటప్పుడు తమతో కొన్ని పిండివంటలు కూడా తీసుకుని వెడతారు. వాటిని తిని రోజంతా సంతోషంగా అక్కడే గడుపుతారు. దీన్ని ఉగాది జాతర అంటారు. రైతుల దగ్గర పనిచేసే జీతగాళ్ళు మళ్ళీ అక్కడే పని చెయ్యడమో...వేరే యజమాని దగ్గర పనికి చేరడమో ఉగాది రోజే నిర్ణయించుకుంటారు.

ఉగాది సంబరం కొత్త బట్టలు, పిండివంటలు, పంచాంగ శ్రవణంతోనే పూర్తవదు. అసలు ఉత్సాహం వసంత మాసంలో ప్రకృతి పచ్చదనానికి పులకరించే కోయిలల కుహూ! కుహూ! రావాలతో నిండి ఉంటుంది. వసంత ఋతువు అందాల్ని ఎర్రన గారు అరణ్య పర్వంలో ఇలా వర్ణించారు.

త్రేనులు గ్రోలి క్రోలి కడుతియ్యని కమ్మని పండులింపు సొం
పానగ నానియాని పరపందిన నీడలు సొచ్చి సొచ్చి మం
దానిల శైత్య సౌరభ సమగ్రతకుం గడు జొక్కి చొక్కియు
ద్యానమునందు మారుతసుత ప్రముఖుల్ విహరించి తృప్తులై.

    కవుల కవితా గానాలు, పద్య పఠనాలు, అవధానాలతో చైత్ర మాసం మొత్తం ఉత్సాహంగాను, ఉల్లాసంగాను గడిచి పోతుంది.

   తెలుగు భాషని మాట్లాడే ప్రజల సంస్కృతి సంప్రదయాల ప్రాచీనతని తెలియ చేసే ఉగాది పండుగ తెలుగు ప్రజలకు మొదటి పండుగ!! కొత్త సంవత్సరంలో పాఠకులందరూ ఏ కష్టమూ లేకుండ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంత జీవనాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు!

Categories
Read more