100% FREE Shipping all across India

నెల రోజుల పండుగ - సంబరాల సంక్రాంతి

నెల రోజుల పండుగ - సంబరాల సంక్రాంతి

సూర్యుడు మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరిస్తూ ధనూరాశి నుండి మకరరాశిలోకి మారిన తరుణమే మకర సంక్రాంతి. ఈ సంక్రాంతినే మనం మూడు రోజుల పండుగగా జరుపుకుంటున్నాం. ఇది మార్గశిర పుష్యమాసం ఉత్తరాయణం ప్రారంభంలో వస్తుంది. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయణం పితృదేవతలకు ముఖ్యం. ఆందుకే ఉత్తరాయణం పుణ్యకాలంగా ప్రసిద్ధికెక్కింది. సంక్రాంతిని స్త్రీపురుష రూపాలలో కూడా కీర్తిస్తుంటారు. ఉదాహరణకు సంక్రమణ పురుషుడు ప్రతి సంవత్సరం కొన్నికొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగ ఉంటాడనీ, ఏదో ఒక వాహనం మీద వచ్చి శుభాలను కలిగిస్తాడని ప్రతీతి.

   ధనుర్మాసం మొదలైనప్పటినుంచి సూర్యకాంతి దక్షిణదిశ నుంచి జరుగుతూ వచ్చి సంక్రాంతి నాటికి సంపూర్ణంగా ఉత్తరదిశకు మారుతుంది. అందుకే ఈ నెల రోజుల కాలాన్ని ‘నెలపట్టడం’ అంటారు.

   భారతీయ సంప్రదాయంలో మూడు అంకెకు ఓ ప్రత్యేకత ఉంది. త్రిమూర్తులు, సృష్టి స్థితి లయలు, సత్త్వరజోస్తమోగుణాలు, భూత భవిష్యద్వర్తమానాలు అంటూ మూడు అంకెకి ఎనలేని ప్రత్యేకత. అలాగే ‘సం’ అంటే చక్కని, ‘క్రాంతి’ అంటే మార్పుని తెచ్చే సంక్రాంతి పండుగ కూడా..  మూడు రోజుల పండుగ! అయితే ఇది మూడు రోజుల పండుగే కాదు. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచే పండుగ వాతావరణం తెలుగు ముంగిళ్ల ముందు సందడి చేస్తుంటుంది.

   సంక్రాంతి పండుగని మనం మూడు రోజులు అనిచెప్పుకుంటున్నా కూడా నెల రోజులు జరుపుకుంటున్నాం. విశేషాలు తెలుసుకుందాం...

   "ధనుర్మాసం"  ఒక విశిష్టమైన మాసం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో ప్రధానమైనవి చాంద్రమానం, సౌరమానం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ఉన్నమాసాన్ని"ధనుర్మాసము"  అంటారు.

  ఈ నెల శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది.  సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ’, నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. 

  ఈ ధనుర్మాసంలో  శ్రీమహావిష్ణువుని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా మంచి సత్ఫలితాలని ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది .

   ధనుస్సు అనే పదానికి ..ధర్మం అని అర్ధం. అంటే ఈ ధనుర్మాసంలో ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ  శ్రీమహావిష్ణువుకి ప్రీతిపాత్రమవుతాము. ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి. "గో" అనే శబ్దానికి జ్ఞానము అని, "ద" అనే శబ్దానికి ఇచ్చునదిఅని అర్ధం. గోదాదేవి చెప్పిన పాశురాల్ని ధనుర్మాసంలో విష్ణు ఆలయాల్లో తప్పనిసరిగా గానం చేస్తారు.

  ప్రతీ ధనుర్మాసంలోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాశురాల విశేషం. నెల రోజులూ హరిదాసుల కీర్తనలతో, జంగమదేవరలతోను, గంగిరెద్దులను ఆడించేవారితోనూ, సందడిగా వుంటుంది .

   మనకి జనవరి నెల అంటే ధనుర్మాసంలో వచ్చేది అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగని సందడి, అనందము, ఆధ్యాత్మికత, సంప్రదాయము, సంస్కృతి అన్నీ కలబోసి సంబరాలు చేస్తూ జరుపుకుంటాము. అందుకని సంక్రాంతి పండుగలో ఉండే అనందాన్ని మనమందరము పంచుకుందాము.

  ఈ పండుగ భోగి, మకర సంక్రాంతి, కనుమ అనే మూడు పేర్లతో జరుపుకునే పండుగ. నెల రోజుల ముందు నుంచే సాయంకాలం ఇంటి ముందు ఆవుపేడ కలిపిన నీళ్లతో కళ్లాపు చల్లి ముగ్గులు పెట్టి వాటి మధ్య ఆవు పేడతో గొబ్బిళ్లు చేసి పెడతారు. గొబ్బిళ్లని పూలతో అలంకరించి పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేస్తారు. అందాలొలికే ఆడపిల్లలు వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ చేసే కిలకిలరావాలతో నెల రోజులకి ముందే మొదలవుతుంది సంబరాల సంక్రాంతి పండగ సందడి.

  మొదటి రోజు జరుపుకునే పండుగని ‘భోగి’ పండుగ అంటారు. ఈ పండుగ రోజు భోగి స్నానం, భోగి పళ్లు, పిండివంటలకి ప్రాధన్యతనిస్తారు. ఉదయాన్నే లేచి వీధి కూడళ్లలో చలిమంటలు వేస్తారు. వీటిని భోగి మంటలు అంటారు. గొబ్బిళ్లు పెట్టుకునే వేడుక ఆడపిల్లలదయితే...భోగి మంటలు వేసుకునే వేడుక మగపిల్లలది. పాత వస్తువుల్ని, పనికిరాని వస్తువుల్ని ఏరుకొచ్చి ఈ భోగిమంటల్లో వేస్తారు. ఇలా చెయ్యడాన్ని  పాతదనాన్ని వదిలిపెట్టి కొత్తదనానికి స్వాగతం చెప్పడంగా భావిస్తారు. అలాగే గొబ్బిళ్లతో చేసిన ఆవు పిడకల్ని ఎండబెట్టి వాటిని కూడా భోగి మంటల్లో వేస్తారు. పిల్లలందరూ దాని చుట్టూ చేరి చలికాచుకుంటుంటే... గృహిణులు గిన్నెలతో నీళ్లు తెచ్చుకుని ఆ మంటల దగ్గర కాచుకుని పిల్లలకి తలస్నానం చేయిస్తారు.

    పసిపిల్లలకి అపదలు ఏవీ రాకూడదని రేగిపళ్లు, శనగలు, పువ్వులు, అక్షింతలు డబ్బులు కలిపి దిష్టి తీస్తారు. ముత్తైదువుల్ని పిలిచి వేడుకగా పేరంటం జరిపిస్తారు. రేగి పండుని బదరీ ఫలము అంటారు.. నారాయణుడు తపస్సు చేసినప్పుడు రేగిపళ్లని ఆహారంగా తీసుకున్నాడని చెప్తారు. అందుకనే ఈ పండుగని శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన పండుగగా భావిస్తారు. పిల్లలకి రేగిపళ్లు తల మీద పోసి శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభించినట్టుగా భావిస్తారు. గోదాదేవి శ్రీమన్నారాయణుణ్ని చేపట్టింది భోగిరోజే అని చెప్తారు. గొబ్బిళ్లల్లో పెద్ద గొబ్బిని శ్రీమన్నారాయణుడని, చిన్న గొబ్బిని ఆండాళ్లని, చుట్టూ ఉండే గొబ్బిళ్లని గోపికలని భావిస్తూ గొబ్బిళ్ల చుట్టూ పాటలు పాడుతూ, చేతులు తట్టుతూ తిరుగుతారు.

   ఈ పండుగకి చేసుకునే పిండివంటల్లో అరిసెలకే ఎక్కువ ప్రాధన్యతనిస్తారు.

   రెండో రోజు ‘సంక్రాంతి’ పండుగని ఇంకా ఎక్కువ సందడిగా జరుపుకుంటారు. కొత్త అల్లుళ్లు తప్పనిసరిగా సంక్రాంతి పండుగకి అత్తవారింటికి వస్తారు. బంధుమిత్రులందరూ కలిసి పిండివంటలతో భోజనం చేసి, కొత్తబట్టలు ధరించి  ఇష్టాగోష్టితో కాలక్షేపం చేస్తారు. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని, అప్పటినుంచే ఉత్తరాయణం ప్రవేశిస్తుందని చెప్తారు. ఉత్తరాయణం పుణ్యకాలమని, అప్పటి వరకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించాకే తనువు చాలించాడని పురాణగాథ. ఉత్తరాయణంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. పితృదేవతల్ని పూజించడం, సూర్యుణ్ని అరాధించడం ప్రత్యేకత.  

   మూడో రోజు ‘కనుమ’ని కర్షకుల పండుగ అని అంటారు. పశువుల్ని అందంగా అలంకరిస్తారు. పులగం వండి పశువులకి పెట్టి మిగిలినదాన్ని పొలాల్లో చల్లుతారు. శ్రీకృష్ణుడు కనుమరోజే గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోవుల్ని రక్షించాడని చెప్తారు. ఆ రోజు కాకి కూడా ప్రయాణం చెయ్యదని చెప్తూ ఇంటికి వచ్చిన బంధువుల్ని కూడా ప్రయాణం చెయ్యనివ్వరు. కనుమ పండుగ పూర్తిగా తెలుగింటి పండుగ.

   సంక్రాంతి పండుగకి తెలుగు సంస్కృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ పండుగ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయం, సంబరం, సందడి, వేడుకలు కలబోసిన పండుగ. ఈ పండుగ శోభని చూడాలంటే పల్లెల్లోనే చూడాలి.

  ఇంటికి వచ్చిన కొత్త జంటలు, భోగిపళ్లు, చక్కెర పొంగళ్లు, అరిసెల పిండివంటలు, బొమ్మల కొలువులు ఒక ఎత్తైతే...పాటలు పాడుతూ వచ్చే హరిదాసులు, అందంగా అలంకరించుకుని వచ్చి ఇంటి ముంగిట్లో అనందంగా నిలబడి మనకి తమ అందాన్ని చూపించే గంగిరెద్దులు. అంబ పలుకు-జగదంబ పలుకు అనే బుడబుక్కలు; శంఖనాదంతో జంగందేవర్లు; కనికట్టు విద్యని ప్రదర్శిస్తూ కాటి కాపర్లు; ఇంటింటికి వచ్చి ఎవరి విద్యని వాళ్లు ప్రదర్శిస్తుంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కళ్లకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇంటి ముంగిట ముగ్గులు, గొబ్బిళ్లు, సింహద్వారాలకి మామిడి తోరణాలు, బంతులు, చేమంతులు, గుమ్మడి పువ్వుల మాలలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. వస్త్రాలు, మజ్జిగ, పెరుగు, గమ్మడి పళ్లు, కంబళ్లు, సజ్జ రొట్టెలు నేతితో చేసిన వంటకాలు ఈ పండుగ ప్రత్యేకతలు.  గొప్ప పుణ్యకాలం కనుక, దానాలు విరివిగా చేస్తారు.

   గొబ్బి చుట్టూ చేతులు తట్టుతూ...గుండ్రంగా తిరుగుతూ అభినయంతో పాడే పాటల్ని గొబ్బిపాటలు అంటారు. గొబ్బిళ్లు లేకుండా  గుండ్రంగా తిరుగుతూ అభినయంతో పాడే పాటల్ని కుమ్మి పదాలు అంటారు. సాయంత్రం పూట గొబ్బిళ్లు పెట్టి పేరంటానికి పిలిచి “సుబ్బి గొబ్బెమ్మా సుఖపడనిస్తావా/ మల్లెపువ్వంటి మరిదినిస్తావా/మంకెన పువ్వంటీ మరదల్నిస్తావా” అంటూ తమ జీవితం మృదువుగా సాఫీగా నడవాలని కోరుకుంటూ పాటలు పాడుతూ గొబ్బిళ్లని పూజిస్తారు.

   ఆ రోజు పెద్ద, చిన్న అందరి వస్త్రధారణ తెలుగు సంస్కృతికి అద్దం పడతాయి. మట్టితో సంక్రాంతి పురుషుడి బొమ్మని తయారు చేసి బలిచక్రవర్తిగా భావిస్తూ నైవేద్యం పెడతారు. కొత్త గిన్నెతో పాలు కాస్తూ సంక్రాంతి పురుషుడు ఏ దిక్కులో వస్తాడో ఆ వైపుకి పాలు పొంగేట్టు చూస్తారు. పప్పుబెల్లాలు నైవేద్యంగా పెడతారు. పొంగి కిందపడిన తరువాత మిగిలిన పాలని తీసుకుని వెళ్లి “ఎలుక ముట్టాలేదు-చిలుక ముట్టాలేదు నీకే పెట్టితినయ్యా కాలభైరవుడా!” అని పాడుకుంటూ పొలంలో చల్లి ఎక్కువ ధాన్యం ఇంటికి రావాలని కోరుకుంటారు.

   కొత్త ధాన్యం ఇంటికి వచ్చే పండుగ కనుక మాలెతలు వరి వెన్నుల్ని కలిపి కట్టి ఒక పళ్ళెంలో పెట్టుకుని పసుపు, కుంకుమ, పువ్వులు వేసి అలంకరించి “పాండవులు పాండవులు తుమ్మెదా...పంచపాండవులు తుమ్మెదా” అని పాడుతూ తిరుగుతారు.

   నెల రోజులు ముందు నుంచే ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసుల సందడితో మొదలుపెట్టి భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో ముచ్చటగా మూడు రోజులూ జరుపుకునే సంక్రాంతి పండుగ అసలైన తెలుగుతనంతో అందర్నీ అనందంలో ముంచెత్తుతుంది. ముంగిళ్లలో కళ్లాపి జల్లి, ముత్యాలముగ్గులు, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో  కనుల విందుగా వుంటుంది. ధాన్యపు రాశులను ఇళ్లకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు "సంక్రాంతి" పండుగ కోసం ఎదురు చూస్తూ వుంటాయి.

   నెల పట్టినది మొదలు సంక్రాంతి మూడు రోజుల పండుగ వరకు నెల రోజులు సందడిగాను, భక్తి పారవశ్యంతోను  ఉత్సాహము, శక్తి, భక్తి, ఆనందం, స్నేహం, బంధుత్వం కలబోసి సంతోషంగాను గడిచిపోతుంది. ఆహ్లాదంగాను, భక్తి పారవశ్యంతోను నెల పట్టిన దగ్గరనుంచి సంక్రాతి పండుగ వరకు గడిచే ఈ ధనుర్మాసంలో అందరూ శ్రీమహావిష్ణువుకి ప్రీతి పాత్రులై సకల ఐశ్వర్యాలు పొందాలని కోరుకుందాం!

   ఇంటికి వచ్చే కొత్త పంటలతో సంపదల్ని, కల్తీ లేని సరుకులతో చేసుకున్న పిండివంటల ఆరగింపుతో ఆరోగ్యాన్ని, కొత్తబట్టలు కట్టుకుని పెద్దల పాదాలకి నమస్కరించి పొందిన ఆశీస్సులతో ఆయుష్షుని పొంది అనందంగా గడుపుదాం. పాఠకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!!

రచయిత్రి:

    శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు బాలసాహితీవేత్తగా విశేష రచనలు చేశారు. బందరు సాహితీవేత్తల సమక్షంలో పురస్కారాన్ని అందుకున్న ఆమె వెలువరించిన ముంగిటిముత్యాలు బాలల గేయకావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిద్ధ రచన. వీరి పరిశోధనాత్మక రచనలు మన ప్రాచీన సంస్కృతికి సంబంధించిన అనేక విశేషాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటివరకూ 20కి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. చిన్నపిల్లలు తమంత తాముగా చదివి అర్థం చేసుకో గలిగేలా వీరి రచనా శైలి ఉంటుంది. 

Categories
Read more